Hot Widget

Ticker

6/recent/ticker-posts

AP TET Special | Telugu - సమాసాలు

AP TET Special | Telugu - సమాసాలు   సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, క్రొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని “ఉత్తరపదం” అంటారు.
ఉదా :
రామ బాణము’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వపదము. ‘బాణము’ అనేది ఉత్తరపదము.

ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని, నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని “ద్వంద్వ సమాసం” అంటారు. (సమాసంలోని రెండు పదముల అర్థానికి ప్రాధాన్యం కల సమాసము ద్వంద్వ సమాసము.)

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.

1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు.

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు


I. ఈ కింది ద్వంద్వ సమాసాలను వివరించండి. విగ్రహవాక్యం రాయండి.

సమాస పదాలు

విగ్రహవాక్యాలు

1) ఎండవానలు

ఎండా, వానా

2) తల్లిదండ్రులు

తల్లి, తండ్రి

3) గంగా యమునలు

గంగ, యమున

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.

విగ్రహవాక్యం

సమాసపదం

1) కుజనుడూ, సజ్జనుడూ

కుజన జనులు

2) మంచి, చెడూ

మంచిచెడులు

3) కష్టమూ, సుఖమూ

కష్టసుఖములు

2. ద్విగు సమాసం: సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాలను ద్విగు సమాసాలు అంటారు.
అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :
నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1)
రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2)
దశావతారాలు — దశ (10) సంఖ్య గల అవతారాలు
3)
ఏడురోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4)
నాలుగువేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు”.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాయండి.

సమాసం

విగ్రహవాక్యం

1) రాజభటుడు

రాజు యొక్క భటుడు

2) తిండి గింజలు

తిండి కొఱకు గింజలు

3) పాపభీతి

పాపము వల్ల భీతి

గమనిక :
రాజ భటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ అనే పదం ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే, ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీవిభక్తి ప్రత్యయం. భటుడు, రాజుకు చెందినవాడు అని చెప్పడానికి ష విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు”.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలు

విభక్తులు

ఉదాహరణ, విగ్రహవాక్యం

1) ప్రథమా తత్పురుష సమాసం

డు, ము, వు, లు

మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య

2) ద్వితీయా తత్పురుష సమాసం

ని, ను, , కూర్చి, గురించి

జలధరం – జలమును ధరించినది

3) తృతీయా తత్పురుష సమాసం

చేత, చే, తోడ, తో

బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు

4) చతుర్థి తత్పురుష సమాసం

కొఱకు, కై

వంట కట్టెలు – వంట కొఱకు కట్టెలు

5) పంచమీ తత్పురుష సమాసం

వలన, (వల్ల) కంటె, పట్టి

దొంగభయం – దొంగ వల్ల భయం

6) షష్ఠీ తత్పురుష సమాసం

కి, కు, యొక్క లో, లోపల

రామబాణం – రాముని యొక్క బాణం

7) సప్తమీ తత్పురుష సమాసం

అందు,

దేశభక్తి – దేశము నందు భక్తి

8) నఞ్ తత్పురుష సమాసం

నఞ్ అంటే వ్యతిరేకము

అసత్యం – సత్యం కానిది

అభ్యాసం : కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాసం

విగ్రహవాక్యం

సమాసం పేరు

అ) రాజ పూజితుడు

రాజుచే పూజితుడు

తృతీయా తత్పురుషము

ఆ) ధనాశ

ధనము నందు ఆశ

సప్తమీ తత్పురుషము

ఇ) పురజనులు

పురమందు జనులు

సప్తమీ తత్పురుషము

ఈ) జటాధారి

జడలను ధరించినవాడు

ద్వితీయా తత్పురుషము

ఉ) భుజబలం

భుజముల యొక్క బలం

షష్ఠీ తత్పురుషము

ఊ) అగ్నిభయం

అగ్ని వల్ల భయం

పంచమీ తత్పురుషము

ఋ) అన్యాయం

న్యాయం కానిది

నఞ్ తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1)
మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగము)
2)
పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగము)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల ‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము.

కింది వాటిని పరిశీలించండి.
1)
నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2)
నఞ్ + భయం = అభయం – భయం కానిది
3)
నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4)
నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నః’ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకము. దీనికి బదులు తెలుగులో అ, అన్, అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నఞ్’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నఞ్ తత్పురుష సమాసం” అంటారు. అభ్యాసము : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామము పేర్కొనండి.

సమాసం

విగ్రహవాక్యం

సమాసం పేరు

అ) అర్ధ రాత్రి

రాత్రి యొక్క అర్ధము

ప్రథమా తత్పురుషము

ఆ) అనూహ్యము

ఊహ్యము కానిది

నఞ్ తత్పురుషము

ఇ) అక్రమం

క్రమము కానిది

నఞ్ తత్పురుషము

ఈ) అవినయం

వినయం కానిది

నఞ్ తత్పురుషము


4. కర్మధారయ సమాసం :
నల్లకలువ’ అనే సమాస పదంలో ‘నల్ల’, ‘కలువ’ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది, “విశేషణం”. రెండో పదం ‘కలువ’ అనేది, “నామవాచకం”; ఇలా విశేషణానికీ, నామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే, దాన్ని కర్మధారయ సమాసం అంటారు.

4. అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే, ఆ సమాసాన్ని ‘విశ్లేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1)
తెల్ల గుర్రం – తెల్లదైన గుర్రం.
తెలుపు (విశేషణం) (పూర్వపదం) – (మొదటి పదం) గుర్రం – నామవాచకం (ఉత్తరపదం) – రెండవ పదం

4. ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
మామిడి గున్న’ అనే సమాసంలో, మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ నామవాచకం, రెండో పదం (ఉత్తరపదం) గున్న అనేది విశేషణం. ఇందులో విశేషణమైన ‘గున్న’ అనే పదం ఉత్తరపదంగా – అంటే రెండో పదంగా ఉండడం వల్ల, దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు.

అభ్యాసం :
కింది పదాలను చదివి, విగ్రహ వాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.
1)
పుణ్యభూమి – పుణ్యమైన భూమి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2)
మంచిరాజు – మంచి వాడైన రాజు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3)
కొత్త పుస్తకం – కొత్తదైన పుస్తకం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4)
పురుషోత్తముడు – ఉత్తముడైన పురుషుడు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం

4.ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
తమ్మివిరులు’ అనే సమాసంలో, మొదటి పదమైన ‘తమ్మి’, ఏ రకం విరులో తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం, నదులు, వృక్షములు, ప్రాంతాలు, మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని ‘సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
మఱ్ఱి చెట్టు – మట్టి అనే పేరుగల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది – గంగ యనే పేరుగల నది – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – ‘భారతము’ అనే పేరుగల దేశం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

4.ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం:
కలువ కనులు’ అనే సమాసంలో కలువ, కనులు అనే రెండు పదాలున్నాయి. దీనికి ‘కలువల వంటి కన్నులు’ అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం
(
పూర్వపదం) ఇక్కడ ‘ఉపమానం’ కాబట్టి దీన్ని “ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

4.ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
పదాబ్జము’ అనే సమాసంలో పద (పాదం) మరియు, అబ్జము (పద్మం) అనే రెండు పదాలున్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మం (తామరపూవు)తో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయం. పద్మం ఉపమానం. ఉపమానమైన అబ్జము అనే పదం, ఉత్తరపదంగా (రెండవపదం) గా ఉండడం వల్ల దీన్ని “ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం” అంటారు.

అభ్యాసము :
కింది సమాసములకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామములు పేర్కొనండి.

సమాసం

విగ్రహవాక్యం

సమాసం పేరు

1) తేనెమాట

తేనె వంటి మాట
తేనె – ఉపమానం; మాట – ఉపమేయం

ఉపమాన పూర్వపద కర్మధారయం

2) తనూలత

లత వంటి తనువు
తనువు – ఉపమేయం; లత – ఉపమానం

ఉపమాన ఉత్తరపద కర్మధారయం

3) చిగురుకేలు

చిగురు వంటి కేలు
చిగురు – ఉపమానం; కేలు – ఉపమేయం

ఉపమాన పూర్వపద కర్మధారయం

4) కరకమలములు

కమలముల వంటి కరములు
కరములు – ఉపమేయం
కమలములు – ఉపమానం

ఉపమాన ఉత్తరపద కర్మధారయం


5. రూపక సమాసం :
విద్యాధనం’ – అనే సమాసంలో విద్య, ధనం అనే రెండు పదాలున్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం కనుక, ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది. ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది ‘రూపక సమాసం’.
ఉదా :
1)
హృదయ సారసం – హృదయం అనెడి సారసం
2)
సంసార సాగరం – సంసారం అనెడి సాగరం
3)
జ్ఞాన జ్యోతి – జ్ఞానము అనెడి జ్యోతి
4)
అజ్ఞాన తిమిరం – అజ్ఞానము అనెడి తిమిరం

6. బహుప్రీహి సమాసం : అన్య పదార్థ ప్రాధాన్యం కలది.

కింది ఉదాహరణను గమనించండి.
చక్రపాణి – చక్రము పాణియందు (చేతిలో) కలవాడు. ‘విష్ణువు’ అని దీని అర్థము. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా “చక్రానికి” కాని “పాణికి” కాని ప్రాధాన్యం లేకుండా, ఆ రెండూ మరో అర్థం ద్వారా “విష్ణువును” సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా, అన్యపదముల అర్థాన్ని స్ఫూరింప జేసే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది. ‘బహుబ్లిహి సమాసం’.

అభ్యాసం :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1)
నీలవేణి – నల్లని వేణి కలది – బహుప్రీహి సమాసం
2)
నీలాంబరి – నల్లని అంబరము కలది – బహుప్రీహి సమాసం
3)
ముక్కంటి – మూడు కన్నులు గలవాడు – బహుప్రీహి సమాసం
4)
గరుడవాహనుడు – గరుత్మంతుడు వాహనంగా గలవాడు – బహుప్రీహి సమాసం
5)
దయాంతరంగుడు – దయతో కూడిన అంతరంగము కలవాడు – బహుప్రీహి సమాసం
6)
చతుర్ముఖుడు – నాలుగు ముఖములు గలవాడు – బహుబ్రీహి సమాసం