Hot Widget

Ticker

6/recent/ticker-posts

AP TET Special | Telugu - సమాపక – అసమాపక క్రియలు

AP TET Special | Telugu -  సమాపక – అసమాపక క్రియలు

 సమాపక – అసమాపక క్రియలు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.

1) ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.

2) వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది.

3) అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు.

అ) సమాపక క్రియలు :

పై వాక్యాలలో ప్రతివాక్యం చివరన ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు.

ఆ) అసమాపక క్రియలు :

వాక్యం మధ్యలో ఉన్న ‘చేసి’ ‘గీసి’ ‘చదివి’ – అన్న క్రియలు పని పూర్తికాలేదని తెలుపుతున్నాయి. వీటిని అసమాపక క్రియలు అంటారు.

ఇ) అసమాపక క్రియా – భేదములు

 

1) క్వార్ధకం : (భూతకాలిక అసమాపక క్రియ)

భాస్కర్ ఆట ఆడి, అలసిపోయి ఇంటికివచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ ‘కర్త’. ‘వచ్చాడు’ అనేది కర్త్య. వాచకానికి చెందిన ప్రధాన క్రియ.

ఆడి, అలసి అనేవి కర్బవాచక పదానికి చెందిన ఇతరక్రియలు. ఆడి, అలసి అనే పదాలు క్రియలే కాని, వాటితో పూర్తి భావం తెలియడం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత, ఏం చేస్తాడు ? అనే ప్రశ్న వస్తోంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు, భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, ‘క్వార్థకం’ అని పిలుస్తారు.

ఈ క్రియలన్నీ ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే చివరి – ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం ‘క్వార్థం’.

ఉదాహరణలు :

పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో ‘తిని’ అనేది క్త్వార్థం (అసమాపక క్రియ).

2) శత్రర్థకం : (వర్తమాన అసమాపక క్రియ)

అఖిలేశ్ మధుకర్ తో ‘మాట్లాడుతూ’ నడుస్తున్నాడు. ఈ వాక్యంలో ‘నడుస్తున్నాడు’ అనే ప్రధానక్రియకు, ‘మాట్లాడుతూ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉండి, అసమాపక క్రియను సూచిస్తుంది.

ఈ విధంగా ‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను ‘శత్రర్థకం’ అంటారు.

ఉదా :

1) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది.

2) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.

గమనిక :

పై వాక్యాలలో 1) చదువుతూ 2) ఆలోచిస్తూ అనేవి శత్రర్థకములు.

3) చేదర్థకం : (ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.)

కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.”

పై వాక్యంలో ప్రధాన క్రియ ‘వస్తుంది’ – ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం . ఈ విధంగా సంక్లిష్ట వాక్యాల్లో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియ ‘చేదర్థకం’ అంటారు. చేత్ అర్థాన్ని ఇచ్చేది – చేదర్థకం. వీటిలో ధాతువుకు తే, ఐతే అనే ప్రత్యయాలు చేరతాయి.

ఉదా :

మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.

అభ్యాసం :

ఈ కింది వాక్యంలోని అసమాపక క్రియలను రాయండి.

1) రమ రోడ్డు మీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.

జవాబు:

తీసి, వేసి, ఎక్కి అనేవి ‘క్వార్థం’ అనే అసమాపక క్రియలు.

తధర్మ క్రియలు :

ఒక వస్తువు స్వభావాన్నీ, ధర్మాన్ని తెలిపే క్రియలనూ, నిత్య సత్యాలను తెలిపే వాటినీ, ‘తద్దర్మ క్రియలు’ అంటారు.

ఉదా :

1) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.

2) సూర్యుడు పడమట అస్తమిస్తాడు.

3) పక్షి ఆకాశంలో ఎగురుతుంది.

ప్రశ్నా వాక్యాలు :

ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నా వాక్యంగా మార్చవచ్చు.

ఉదా :

1) మీరు బడికి వెళతారా?

2) దైన్య స్థితిని చూస్తారా?

అభ్యాసం :

కింది వాటిని జతపరచండి.

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి అ) చేదర్థకం

2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం

3) మానసికంగా ఎదిగినట్లైతే ఇ) ప్రశ్నార్థకం

4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా ఈ) క్వార్ధకం

జవాబు:

1) వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి ఈ) క్వార్ధకం

2) కాపలా కాస్తూ హాయిగా తిని కూర్చో ఆ) శత్రర్థకం

3) మానసికంగా ఎదిగినట్లైతే అ) చేదర్థకం

4) నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్పా ఇ) ప్రశ్నార్థకం

వాక్య భేదములు

వాక్యాలు మూడు రకములు.

1) సామాన్య వాక్యం 2) సంక్లిష్ట వాక్యం 3) సంయుక్త వాక్యం

1) ఉష పాఠం చదువుతున్నది.

2) మురళి మంచి బాలుడు.

1) సామాన్య వాక్యం :

గమనిక :

మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియలేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు.

 

2) సంక్లిష్ట వాక్యం :

ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.

ఉదా :

1) శ్రీకాంత్ అన్నం తిన్నాడు.

2) శ్రీకాంత్ బడికి వచ్చాడు.

జవాబు:

శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

గమనిక :

పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఉంటాయి. ఇటువంటి వాక్యాలను ‘సంక్లిష్ట వాక్యాలు’ అంటారు.

3) సంయుక్త వాక్యం :

సమ ప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను ‘సంయుక్త వాక్యాలు’ అంటారు.

ఉదా :

1) సీత చదువుతుంది, పాడుతుంది.

2) అతడు నటుడు, రచయిత.

3) అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

సామాన్య వాక్యాలు :

అ) రాజు అన్నం తిన్నాడు

ఆ) గోపి పరీక్ష రాశాడు

ఇ) గీత బడికి వెళ్ళింది

గమనిక :

పై వాక్యాల్లో తిన్నాడు, రాశాడు, వెళ్ళింది అనే క్రియలు సమాపక క్రియలు. ప్రతి వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంది. ఇలా ఒకే సమాపక క్రియ ఉంటే, ఆ వాక్యాలను ‘సామాన్య వాక్యాలు’ అంటారు.

కొన్ని సామాన్య వాక్యాలు క్రియ లేకుండా కూడా ఉంటాయి.

ఉదా :

హైదరాబాదు మన రాష్ట్ర రాజధాని.

సంక్లిష్ట వాక్యాలు :

గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.

గమనిక :

పై సామాన్య వాక్యాలలో రెంటిలోనూ ‘గీత’ అనే నామవాచకం ఉంది. ఈ విధంగా తిరిగి చెప్పబడిన నామవాచకాన్ని తొలగించి, మొదటి వాక్యంలోని క్రియ ‘వెళ్ళింది’ లోని క్రియ ‘వెళ్ళింది’ అనే దాన్ని ‘వెళ్ళి’ అనే అసమాపక క్రియగా మార్చి రాస్తే సంక్లిష్ట వాక్యం ఏర్పడుతుంది.

ఉదా :

గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :

కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

అ) 1) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.

జవాబు:

విమల వంట చేస్తూ, పాటలు వింటుంది (సంక్లిష్ట వాక్యం)

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.

జవాబు:

అమ్మ నిద్రలేచి, ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)

 

అభ్యాసం :

కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.

1) తాత భారతం చదివి, నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)

జవాబు:

తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)

2) చెట్లు పూత పూస్తే, కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)

జవాబు:

చెట్లు పూత పూయాలి. చెట్లు కాయలు కాయాలి. (సామాన్య వాక్యాలు)

3). రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)

జవాబు:

రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)

అభ్యాసం :

కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

ఉదా :

1) శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. (సామాన్య వాక్యాలు)

జవాబు:

శర్వాణి పాఠం చదివి, నిద్రపోయింది. (సంక్లిష్ట వాక్యం)

2) మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. (సామాన్య వాక్యాలు)

జవాబు:

మహతి ఆట ఆడి, అన్నం తిన్నది. (సంక్లిష్ట వాక్యం)

3) నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్ళు తాగుతాడు. (సామాన్య వాక్యాలు)

జవాబు:

నారాయణ అన్నం తింటూ నీళ్లు తాగుతాడు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :

కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.

ఉదా :

1) శరత్ ఇంటికి వచ్చి, అన్నం తిన్నాడు. (సంక్లిష్ట వాక్యం)

జవాబు:

శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. (సామాన్య వాక్యాలు)

2) రజియా పాటపాడుతూ ఆడుకుంటున్నది. (సంక్లిష్ట వాక్యం)

జవాబు:

రజియా పాట పాడుతుంది. రజియా ఆడుకుంటున్నది. (సామాన్య వాక్యాలు)

 

సంయుక్త వాక్యం :

కింది వాక్యాలను గమనించండి.

విమల తెలివైనది. విమల అందమైనది – విమల తెలివైనది, అందమైనది.

ఇలా రెండు సామాన్య వాక్యాలు కలిసి, ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు.

సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు వచ్చే మార్పులు :

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది

వనజ చురుకైనది, అందమైనది (రెండు నామపదాల్లో ఒకటి లోపించడం)

ఆ) అజిత అక్క. శైలజ చెల్లెలు.

అజిత, శైలజ అక్కా చెల్లెళ్ళు. (రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది)

ఇ) ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?

ఆయన డాక్టరా? ప్రొఫెసరా? (రెండు సర్వనామాల్లో ఒకటి లోపించింది)

అభ్యాసం :

కింది సామాన్య వాక్యాల్ని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

1) ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు (సామాన్య వాక్యాలు)

జవాబు:

ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు. (సంయుక్త వాక్యం)

2) మోహన కూచిపూడి నృత్యం. నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. (సామాన్య వాక్యాలు)

జవాబు:

మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :

కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1) చుక్క పొడుపుతో సీత లేచింది. సీత గడపను పూజించింది. (సామాన్య వాక్యాలు)

జవాబు:

సీత చుక్క పొడుపుతో లేచి, గడపను పూజించింది. (సంక్లిష్ట వాక్యం)

2) బంధుమిత్రులంతా వచ్చేశారు. కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సామాన్య వాక్యాలు)

జవాబు:

బంధుమిత్రులంతా వచ్చి, ‘కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సంక్లిష్ట వాక్యం)

అభ్యాసం :

కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

1) సీతక్క నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సామాన్య వాక్యాలు)

జవాబు:

సీతక్క నిశ్చితార్థం జరిగింది, కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యం)

2) సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయింది. (సామాన్య వాక్యాలు)

జవాబు:

సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు, కాని పెండ్లి పెటాకులయ్యింది. (సంయుక్త వాక్యం)

అభ్యాసం :

కింది వాటిని సంయుక్త వాక్యాలుగా రాయండి.

1) బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చాడు. వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది.

జవాబు:

బుద్ధదేవుడు వటవృక్షచ్ఛాయకు వచ్చిన వెంటనే అష్టాంగ ధర్మప్రవచనం ప్రారంభమైంది. (సంయుక్త వాక్యం)

2) లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది. లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు.

జవాబు:

లేగ మూలంగా నందగోపునికి అదృష్టం కలిగింది కాబట్టి లేగదూడను నందగోపుడు ముద్దు పెట్టుకున్నాడు. (సంయుక్త వాక్యం)

(అ) రెండు గాని, అంతకంటే ఎక్కువగాని వాక్యాలలోని సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి, ఆ వాక్యాలను ఒకే వాక్యంగా రాస్తే దాన్ని, సంక్లిష్ట వాక్యం అంటారని మీరు తెలుసుకున్నారు.

అభ్యాసం :

కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

1) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు. (సామాన్య వాక్యం)

జవాబు:

ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాస్తూ ఆంగ్లేయ ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు. (సంక్లిష్ట వాక్యం)

2) నన్ను మీరు క్షమించవలయును. మఱియెప్పుడైన ఈ సభ తిరుగఁజేసి కొనుడు.

జవాబు:

నన్ను మీరు క్షమించి మటియెప్పుడైన ఈ సభ తిరుగజేసికొనుడు (సంక్లిష్ట వాక్యం)

 

అభ్యాసం :

కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.

1) రమ రోడ్డు మీద ఉన్న కాగితం ముక్కను తీసి, దగ్గరలోనున్న చెత్తకుండీలో వేసి మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది. (ఇ)

అ) సామాన్య

ఆ) సంయుక్త

ఇ) సంక్లిష్ట

పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.

జవాబు:

1) తీసి

2) వేసి

3) ఎక్కి

2. ప్రశ్నార్థక వాక్యం : ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారు చేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.

ఉదా :

దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?

జవాబు:

1) మీరెప్పుడైనా గమనించారా? (గమనించారు + ఆ)

2) మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)

3) వీటిని మీరు చూపిస్తారా? (చూపిస్తారు + ఆ)

4) నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)

5) శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)

6) ఇంట్లకెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)

7) అట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)

 

I. క్రియను మార్చి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.

1) పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒకనెల రోజుల వ్యవధి కావాలి.

జవాబు:

పుస్తక రచనను పూర్తి చేయడానికి ఒక నెల రోజుల వ్యవధి అక్కర్లేదు. (వ్యతిరేక వాక్యం )

2) నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోలేకపోయాను.

జవాబు:

నా మాతృభూమి విస్తృతి ఎంతో తెలుసుకోగలిగాను. (వ్యతిరేకార్థక వాక్యం)

II. కింది వానికి వ్యతిరేకార్థక వాక్యాలు రాయండి.

1) ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు.

జవాబు:

ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది. (వ్యతిరేకార్థక వాక్యం)

2) రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడ్డాడు.

జవాబు:

రాత్రి తెల్లవార్లూ నందగోపుడు ఆరాటపడలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)

3) నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు.

జవాబు:

నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు. (వ్యతిరేకార్థక వాక్యం)

4) ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడలేదు.

జవాబు:

ఒక్క పలుకైనా ఆయన నోటి నుండి వెలువడింది. (వ్యతిరేకార్థక వాక్యం)