Hot Widget

Ticker

6/recent/ticker-posts

బాహుబలి సినిమా లో తాటి చెట్లు నీ వంచారు కదా..ఇలా చేస్తే ఆడియన్స్ కి డౌట్ వస్తుందని అనిపించలేదా డైరెక్టర్ సార్ కి? "

 "అవుటాఫ్ సైట్ ఈజ్ అవుటాఫ్ మైండ్"

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా రచన గురించి రాసిన పుస్తకాల్లో (11త్ అవర్, తెలుగు సినిమా కథ-కథనం-శిల్పం) ఒక ముఖ్యమైన సూత్రంగా పై వాక్యం పదే పదే చెప్తారు. ఒకరిని మనం తరచు చూడకపోతే మరచిపోతాం అన్న అర్థంలోని పై సామెతను ఆయన సినిమాకు దాదాపుగా ఇలా అన్వయిస్తారు:

ఒక్కసారి ప్రేక్షకుల కళ్ళ ముందు నుంచి ఒక అంశం ప్రశ్న రేకెత్తించ కుండా వెళ్ళిపోతే ఇంక ఆ ప్రశ్న ప్రేక్షకులకు సినిమా పూర్తయ్యేదాక రాదు, వాళ్ళ సినిమా అనుభవాన్ని దెబ్బకొట్టదు.

ఒకవేళ గనుక ఆ సీన్ థియేటర్లో చూస్తున్నప్పుడే ప్రేక్షకులకు "ఎహె ఏంటిది మరీ ఓవర్ గా ఉంది" అని అనిపించింది అంటే అది తప్పనిసరిగా సినిమాను ఏదొక స్థాయిలో దెబ్బతీస్తుంది.

ఎందుకంటే - సినిమాకు ముఖ్యమైన అంశం ప్రేక్షకుల తాదాత్మ్యం. తాదాత్మ్యం చెందిన ప్రేక్షకులే కథా గమనంలో రసానుభూతి చెందుతారు. ఏ నిమిషమైతే ఆ తాదాత్మ్యం చెదిరిపోయిందో ఆ నిమిషమే రసభంగం అయిపోతుంది.

ఆ తాదాత్మ్యం నిలబెట్టడానికి ముఖ్యమైన దినుసు "వాస్తవికత" (రియాలిస్టిక్) అని చాలామంది సినిమా విశ్లేషకులు, విమర్శకులు భ్రమపడుతూ ఉంటారు. కాదు, ఆ దినుసు - నమ్మించగలగడం (బిలీవబిలిటీ).

  • అతడులో హీరో బిల్డింగ్ మీంచి గబుక్కున రైలు మీదికి తాడు సాయంతో దూకేసినప్పుడు నాబోటి ప్రేక్షకులు "ఇలా ఎలా సాధ్యం" అని థియేటర్లో అనుకోలేదు. కొన్ని పదుల సార్లు చూశాక ఎప్పుడో సినిమాలో లీనం అవ్వకుండా పకోడీలు తింటూ చుట్టూ ఉన్నవాళ్ళలో జోకులు వేస్తూ చూసినప్పుడు తట్టింది. "మధ్యలో వైర్లు ఉండవా! దాని మీద పడితే మసి కాదా? అసలు ఆ స్టేషన్ ఎక్కడుంది, ఈ అపార్టమెంట్ ఎక్కడుంది?" వగైరా లాజిక్కులు - సినిమా సేఫ్.
  • బాహుబలి 1లో హీరో "ధీవరా!" అంటూండగా కొండలు బండల మీంచి దూకితే దభీమని పడినప్పుడు థియేటర్లో "వాడి బుర్ర చితికిపోదా" అని తట్టలేదు. ఎప్పుడో యూట్యూబ్ లో పాట చూస్తున్నప్పుడు అనిపించింది - సినిమా సేఫ్
  • మగధీరలో హీరో ఎప్పుడు హీరోయిన్ ని టచ్ చేసినా కరెంట్ షాక్ కొట్టి, గత జన్మ స్మృతుల్లోకి జారిపోతాడు. సినిమా చూసినప్పుడు "అమ్మాయిని టచ్ చేయగానే కరెంట్ షాకులు కొడుతూ ఉంటే వీళ్ళు పెళ్లి ఏం చేసుకుంటారు, కాపురమేం చేస్తారు, అసలు వీళ్ళ ఫ్యూచర్ ఏమిటి" అన్న ప్రశ్న ఆ ఊపులో వెయ్యలేదు. ఎంతసేపూ వీళ్ళ గతం ఏమిటో అన్న ఉత్సుకతే కలిగింది. ఈ చొప్పదంటు ప్రశ్న ఆనక ఓ రెండేళ్లకు కలిగింది - సినిమా సేఫ్

అట్లాగే, ఈ తాటి చెట్లు వంచడము, దాని వెనుక భౌతిక శాస్త్ర సూత్రాలు బాహుబలి 2 చూసేప్పుడు ఆ తాదాత్మ్యత నుంచి బయటకు లాగి అనుభవం చెడగొట్టలేదు కాబట్టి సినిమా సేఫ్.

అదే క్రమంలో, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా చూస్తున్నప్పుడు హీరో తొడగొడితే రైలు వెనక్కి వెళ్లడం అన్నది అసాధ్యం అన్న విషయం అక్కడికక్కడే ప్రేక్షకులకు తట్టింది.

స్టాలిన్ సినిమా చూసేప్పుడు హీరో బడితే పట్టుకుని వందల మందిని చావచితక గొట్టడం "ఎలా సాధ్యం" అన్న ప్రశ్న కనీసం నాకైతే వచ్చింది. అంతే, ఎక్కలేదు. ఒక పద్నాలుగు ఏళ్ళ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరో వందల మంది మధ్యలోకి వెళ్ళిపోయి ఆ హాస్టైల్ క్రౌడ్ ని ఉట్టి లాఠీ మాత్రమే ఉండి చితక్కొట్టి, కొట్టించుకున్నప్పుడు "అసాధ్యం" అని ఆ నిమిషం అనిపించలేదు. పండింది.

కాబట్టి, రాజమౌళితో పాటు ఆ దర్శకులు అందరూ చేసింది కాలిక్యులేటెడ్ రిస్క్. ఆ లాజిక్ థియేటర్లో ఉన్నప్పుడు జనానికి పెద్ద ఎత్తున తట్టి జనాన్ని తాదాత్మ్యం నుంచి బయటకు తీసుకురాకుండా తీయాలని రాజమౌళి ప్రయత్నించి ఉంటాడు. అంతే కాదు, ఈ సీన్ అవ్వగానే వచ్చే ఫైట్ చాలా గ్రాండ్యూయర్ గా ఉండి ప్రేక్షకులను గుక్కతిప్పుకోనివ్వదు కూడా. ఇవన్నీ కలిసి అలా తట్టదులే అని అవుట్పుట్ చూశాక సంతృప్తి చెంది ఉంటాడు. అది ఆయన అదృష్టం కొద్దీ, ఆయన నిర్మాతల అదృష్టం కొద్దీ నిజమైంది. ఎందుకంటే ఇలాంటివి వర్కవుట్ అవ్వాలంటే హీరో ఇమేజ్, సినిమాలో ఆ సీన్ ప్లేస్ మెంట్, దానికి దర్శకుడు ఇచ్చిన ప్రాధాన్యత, తర్వాత వచ్చే డైలాగులు, ఆ సీన్ చిత్రీకరణ మొదలైన లక్షా తొంభై అంశాలతో పాటుగా గుమ్మడికాయంత అదృష్టం తప్పనిసరి.

ఆ నిమిషం కాక సినిమా చూసి ఇంటికి వెళ్ళాక అయినా సరే మనకు తట్టినంత మాత్రాన సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ నిమిషం కూడా ఒకరికో ఇద్దరికో కాక చాలామంది ప్రేక్షకులకు తట్టి "ఆడిటోరియం మూడ్" దెబ్బతింటేనే సినిమా నవ్వులపాలు అవుతుంది. లేకున్నా సేఫ్ యే!