Hot Widget

Ticker

6/recent/ticker-posts

AP TET Special - Telugu - కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

AP TET Special - Telugu - కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు

1) కింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి.

అ) సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.

ఆ) సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి.

గమనిక :

పై రెండు వాక్యాల అర్థం ఒక్కటే. కాని వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది.

1) “సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు”.

1) కర్తరి వాక్యం :

ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది. అంటే క్రియ, కర్తను సూచిస్తుంది. కర్మకు, ద్వితీయా విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని ‘కర్తరి వాక్యం ‘ అంటారు.

2) సంఘసంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అనే రెండవ వాక్యంలో 1) కర్తకు తృతీయా విభక్తి ఉంది.

2) క్రియకు ‘బడు’ అనే ధాతువు చేరింది 3) క్రియ – కర్మ ప్రధానంగా ఉంది.

2) కర్మణి వాక్యం :

వాక్యంలో క్రియకు ‘బడు’ ధాతువు చేరి, కర్తకు తృతీయా విభక్తి చేరే వాక్యాన్ని ‘కర్మణి వాక్యం’ అంటారు.

అభ్యాసం – 1 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.

అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)

జవాబు:

వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)

ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)

జవాబు:

ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)

జవాబు:

లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)

ఆ) నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)

జవాబు:

నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)

 

అభ్యాసం – 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.

ఉదా :

ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. (కర్తరి)

జవాబు:

చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. (కర్మణి)

అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)

జవాబు:

ఉసిరికాయ తీసి, లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)

జవాబు:

పిల్లలతో నాయకులచేత అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)

ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. (కర్తరి వాక్యం)

జవాబు:

వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)

అభ్యాసం – 4 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. (కర్మణి వాక్యం)

జవాబు:

గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)

జవాబు:

కాయలు అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసికోబడింది. (కర్మణి వాక్యం)

జవాబు:

బాలురు సెలవు తీసికొన్నారు. (కర్తరి వాక్యం)

కర్తరి, కర్మణి వాక్యాలు

కర్తరి వాక్యం :

జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు.

కర్మణి వాక్యం :

ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి.

గమనిక :

పై రెండు వాక్యాలలో కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థం అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది. కర్మణి వాక్యం చుట్టు తిప్పినట్లు ఉంటుంది. మన తెలుగు భాషలో వాడుకలో ప్రధానంగా కర్తరి వాక్యమే ఉంటుంది.

కర్మణి వాక్యప్రయోగాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చాయి. ఇంగ్లీషు వాక్య పద్ధతి ఇలాగే ఉంటుంది.

1) కర్తరి వాక్యమును ఇంగ్లీషులో (Active voice) అంటారు.

2) కర్మణి వాక్యమును. ఇంగ్లీషులో (Passive voice) అంటారు.

అభ్యాసం :

కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.

1) రమేష్ భారతాన్ని చదివాడు. (కర్తరి వాక్యం)

జవాబు:

రమేష్ చే భారతం చదువబడింది. (కర్మణి వాక్యం )

2) నేనెన్నో పుస్తకాలు రాశాను. (కర్తరి వాక్యం)

జవాబు:

ఎన్నో పుస్తకాలు నాచేత రాయబడ్డాయి. (కర్మణి వాక్యం )

ప్రత్యక్ష, పరోక్ష కథనాలు

అభ్యాసం :

కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి.

1) ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యంలో పై సభ జరుపబడింది. (కర్మణి వాక్యం)

జవాబు:

ఈ పురంలోని హిందూ సమాజం వారి యాజమాన్యం, పై సభను జరిపింది. (కర్తరి వాక్యం)

2) తిరువాన్కూరులో ఒక స్త్రీ మంత్రిణిగా నియమింపబడింది. (కర్మణి వాక్యం)

జవాబు:

తిరువాన్కూరులో ఒక స్త్రీని మంత్రిణిగా నియమించారు. (కర్తరి వాక్యం)

3) విద్యా సంఘాలలో స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపబడ్డారు. (కర్మణి వాక్యం)

జవాబు:

విద్యా సంఘాలలో స్త్రీలను సభ్యురాండ్రుగా నియమించారు. (కర్తరి వాక్యం)

 

ప్రత్యక్ష కథనం :

కింది వాక్యాలు చదవండి.

1. “నన్ను ఉపన్యాసరంగము నొద్దకు దీసికొనిపోయిరి.”

2. “నేనిట్లు ఉపన్యసించితిని.”

3. “నాయనలారా ! నేను మీ సభా కార్యక్రమమునంతయు జెడగొట్టితిని.”

4. “నన్ను మీరు క్షమింపవలయును.”

పై వాక్యాలన్నీ జంఘాల శాస్త్రి నేరుగా చెబుతున్నట్లు ఉన్నాయి కదా !

నేను, మేము, …… ఇలా ఉండే వాక్యాలు అనగా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెబుతున్నట్లుగా ఉంటాయి.

అట్లే కింది వాక్యాలను చదవండి.

1) “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.

2) “నేను రాను” అని నరేశ్ రఘుతో అన్నాడు.

(లేదా)

“నేను రా”నని నరేశ్ రఘుతో అన్నాడు. పై వాక్యాలలో గీత గీసిన మాటలను ఎవరు అన్నారు?

మొదటి దాంట్లో జంఘాలశాస్త్రి అన్న మాటలను, రెండవదాంట్లో నరేశ్ అన్న మాటలను “ఉద్ధరణ చిహ్నాలు” (ఇన్వర్టర్ కామాలు) ఉంచి చెప్పారు కదా ! ఇలా నేరుగా చెప్పదల్చుకున్న అంశాలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి చెప్పినపుడు వారే ప్రత్యక్షంగా చెప్పినట్లుగా ఉంటుంది.

ఈ విధంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.

అభ్యాసం – 1 : పరోక్ష కథనంలోకి మార్చండి.

1) “ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. జాగ్రత్త” అని అతడినే బెదరించింది మెల్లీ. (ప్రత్యక్ష కథనం)

జవాబు:

మెల్లీ అది అంతర్జాతీయ సమస్యగా మారుతుందని అతడినే బెదరించింది. (పరోక్ష కథనం)

2) “చిన్నప్పటి నుండి నాకు బోటనీ విషయం అభిమాన విషయం” అన్నాడు రచయిత. (ప్రత్యక్ష కథనం)

జవాబు:

రచయిత చిన్నప్పటి నుండి తనకు బోటనీ విషయం అభిమాన విషయమని అన్నాడు. (పరోక్ష కథనం)

అభ్యాసం – 2 : పరోక్ష కథనంలోకి మార్చండి.

1) “మా అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేది” అన్నారు కలామ్. (ప్రత్యక్ష కథనం)

జవాబు:

తన అన్నయ్య ముస్తఫా కమల్ కి స్టేషన్ రోడ్ లో ఒక కిరాణా దుకాణం ఉండేదని కలామ్ అన్నారు. (పరోక్ష కథనం)

 

పరోక్ష కథనం :

కింది వాక్యాలు చదవండి.

1. నరేశ్ తాను రానని రఘుతో అన్నాడు.

2. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లుగా చేస్తామని పిల్లలు అన్నారు.

3. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాను.

పై వాక్యాలను చదివారు కదా ! ఇవి నేరుగా చెబుతున్నట్లుగా ఉన్నాయా?

ఉత్తమ పురుషలో కాకుండా, ఇంకొకరు చెబుతున్నట్లుగా ఉన్నాయా?

ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనం అంటారు. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ప్రత్యక్ష కథనంలో ఉన్న వాటిని పరోక్ష కథనంలోకి మార్చడం. కింది వాక్యాలను చదవండి. ఏం మార్పు జరిగిందో చెప్పండి.

1. “నేనొక్కడినే అదృష్టవంతుడినా?” అన్నాడు జంఘాల శాస్త్రి.

2. తానొక్కడే అదృష్టవంతుడా అని జంఘాల శాస్త్రి అన్నాడు.

మొదటి వాక్యంలో జంఘాలశాస్త్రి మాట్లాడిన మాటలను ఉద్ధరణ చిహ్నాలు ఉంచి రాశారు. రెండో వాక్యంలో జంఘాల శాస్త్రి అన్నమాటలను ఇంకొకరు చెప్పినట్లుగా రాశారు. ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలు తీసివేసి “అని” చేర్చి వాక్యాన్ని రాసారు. కాబట్టి మొదటి వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంటే, రెండవ వాక్యం పరోక్ష కథనంలోకి మారింది. ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు పరోక్ష కథనంలోకి మారేటపుడు కింది మార్పులు చోటు చేసుకుంటాయి.

మాటలు / వాక్యంలోని భావాన్ని స్వీకరిస్తారు. ఉద్ధరణ చిహ్నాలు తొలగించి ‘అని’ చేరుస్తారు. ఉత్తమ పురుషపదాలు అనగా నేను, మేము వంటివి, ప్రథమ పురుషలోకి అనగా తను, తమ, తాను, తాములాగా మారుతాయి.

1. పాఠంలోని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను గుర్తించండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

2. మీరే మరికొన్ని ప్రత్యక్ష కథనంలోని వాక్యాలు రాయండి. వాటిని పరోక్ష కథనంలోకి మార్చండి.