జవాబు: నెలల పేర్లు చెప్పమంటే... జనవరితోనే మొదలు పెడతాం కాని ఒకప్పుడు ఈ నెల లేనేలేదు.
👉 జనవరి మొదటి తేదీ రాగానే కొత్త ఏడాది వేడుకలను చేసుకుంటున్నాం. కానీ నెలలు ఏర్పడిన తర్వాత చాలా ఏళ్ల వరకు జనవరి అనే నెలే లేదు. జనవరి లేకపోతే మరి కొత్త సంవత్సరం ఎప్పుడు ఆరంభమయ్యేది? మార్చి 1న ఆ రోజునే ప్రపంచమంతా కొత్త ఏడాదిని స్వాగతించేది. మరి జనవరి నెల ఎలా వచ్చింది? ఎవరు ప్రవేశపెట్టారు.?
👉 ఇప్పుడు మనం వాడుతున్న 12 నెలల క్యాలండర్‌ని గ్రెగరియన్ క్యాలెండర్ అంటారు. దీనికి ముందు అనేక రకాల క్యాలెండర్లు ఉండేవి. వాటిల్లో ముఖ్యమైనది రోమన్ క్యాలెండర్. ఇందులో 10 నెలలే ఉండేవి. జనవరి, ఫిబ్రవరి ఉండేవి కావు. మార్చి 1న కొత్త ఏడాది ప్రారంభమయ్యేది. క్రీస్తు పూర్వం 700 శతాబ్దంలో రోమ్‌ను 'నుమా పాంటిలియస్' అనే చక్రవర్తి పరిపాలించేవాడు. అతడే ఏడాదిని 12 నెలలుగా విభజించి, జనవరి, ఫిబ్రవరి నెలలను కలిపాడు. దాంతో కొత్త ఏడాది ప్రారంభమయ్యే తేది జనవరి 1గా మారింది. మొదటి నెలకి ఏ పేరు పెట్టాలో ఆలోచించి నుమా చక్రవర్తి 'జానస్' అనే రోమన్ దేవుడి పేరు మీద 'జానారిస్' అని పెట్టాడు. వాడుక భాషలో అది జనవరిగా మారింది. అయితే నుమా జనవరికి 30 రోజుల్నే కేటాయించాడు. క్రీ.పూ. 46వ శతాబ్దంలో రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్ మరో రోజును కలిపి 31 రోజుల నెలగా జనవరిని మార్చాడు. తరువాత 15వ శతాబ్దంలో ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగారియన్ క్యాలెండర్ రూపొందింది. ఇది కూడా జనవరిని మొదటినెలగానే కొనసాగించింది.
👉 ఇంతకీ జనవరికి 'జానస్' దేవుడి పేరునే ఎందుకు పెట్టాలి? మనకి వినాయకుడు ఎలాగో రోమన్లకు జానస్ అలాగ. ఏదైనా పని ప్రారంభించే ముందు వాళ్లు జానస్‌కు మొక్కేవారు. ఈ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. ఒక ముఖం గతాన్ని, మరొకటి భవిష్యత్తును సూచిస్తుందని చెబుతారు. ఆరంభానికి, అంతానికి కూడా ఈయనే మూలమని నమ్ముతారు. ఓసారి రోమ్‌ను స్థాపించిన 'రోమ్యులస్' చక్రవర్తిని, అతని పరివారాన్ని పొరుగు రాజ్యపురాణి సబైన్ ఎత్తుకుపోతుంది. అప్పుడు జానస్ దేవుడు వారిపై అగ్నిపర్వతంలోని లావాను వెదజల్లి కాపాడాడనేది కథ.